'టక్ జగదీష్' లాంటి కొడుకు ఉండాలనుకుంటారు: నిర్మాత సాహు గారపాటి

04-09-2021 Sat 17:50
  • మా బ్యానర్ నానీతోనే మొదలైంది 
  • కథ వినగానే ఆయన ఓకే అనేశారు 
  • థియేటర్లలోనే రిలీజ్ చేయాలకున్నాము 
  • ఇప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు  
Tuck Jagadish movie update
నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో 'టక్ జగదీష్' సినిమా రూపొందింది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించారు. సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా గురించిన విషయాలను సాహు గారపాటి చెప్పుకొచ్చారు.

"ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. నానీతోనే మా బ్యానర్ మొదలైంది కనుక, ఆయనతోనే ఈ సినిమా చేయాలని  నిర్ణయించుకున్నాము. కథ నచ్చడంతో నానీగారు కూడా వెంటనే ఓకే చెప్పారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ 'జగదీష్' లాంటి కొడుకు ఉంటే బావుండునని అనుకుంటారు.       

పోయిన ఏడాది డిసెంబర్ లోనే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. అందువల్లనే ఏప్రిల్లో విడుదల చేయాలనుకున్నాము. కరోనా కారణంగా వాయిదావేస్తూ రావలసి వచ్చింది. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో మేము ఆశించిన స్థాయిలో పరిస్థితులు అనుకూలించడం లేదు. అందువల్లనే థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నాము" అని చెప్పుకొచ్చారు.