Varavara Rao: ముంబైలో ఉండటం కష్టంగా ఉంది.. మా ఇంట్లో ఉండేందుకు అనుమతించండి: బాంబే హైకోర్టులో వరవరరావు పిటిషన్

  • ఎల్గార్ పరిషద్ కేసులో వరవరరావుకు జ్యుడీషియల్ రిమాండ్ 
  • అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు
  • కోర్టు షరతులతో ముంబైలోనే ఉంటున్నానని కోర్టుకు తెలిపిన వరవరరావు
Varavara Rao files bail petition in Bombay High Court

విరసం నేత, ప్రముఖ కవి వరవరరావు ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఎల్గార్ పరిషద్ కేసులో జ్యుడీషియల్ రిమాండులో వున్న ఆయనకు.. అనారోగ్య కారణాలతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ముంబైలోనే ఉండాలంటూ షరతు విధించింది.

ఈ నేపథ్యంలో, తెలంగాణలోని తన ఇంట్లో ఉండేందుకు అనుమతించాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆయన ఆశ్రయించారు. తాను ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తన పిటిషన్ లో కోర్టుకు తెలిపారు. బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు కోర్టు విధించిన షరతులన్నింటినీ తాను పాటించానని, ఒక్క షరతును కూడా తాను ఉల్లంఘించలేదని చెప్పారు.

ప్రస్తుతం తన వయసు 84 ఏళ్లని, తన భార్య వయసు 72 ఏళ్లని... కోర్టు ఆదేశాల మేరకు తామిద్దరం ఇంటికి దూరంగా ముంబైలో ఉంటున్నామని వరవరరావు కోర్టుకు తెలిపారు. ముంబైలాంటి మహానగరంలో వైద్య చికిత్సలు చేయించుకోవడం తనలాంటి వాళ్లకు తలకుమించిన భారంగా ఉంటుందని చెప్పారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ఈ నెల 6న వాదనలను వింటామని తెలిపింది. బెయిల్ పొడిగింపు పిటిషన్ పై కోర్టు వాదనలను వినేంత వరకు వరవరరావుపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఎన్ఐఏ చెప్పింది.

ఫిబ్రవరి 22న వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ పై ఉన్నన్ని రోజులు ముంబై ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే నివసించాలని షరతు విధించింది. దీంతో వరవరరావు ముంబైలోనే ఉంటున్నారు. నగరంలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

More Telugu News