Taliban: ఈరోజు మధ్యాహ్న ప్రార్థనల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న తాలిబన్లు?

  • రెండు దశాబ్దాల పోరాటం తర్వాత మరోసారి అధికారాన్ని చేపట్టబోతున్న తాలిబన్లు
  • తాలిబన్లకు లభించని అంతర్జాతీయ సహకారం
  • ఆఫ్ఘన్ లో రాయబార కార్యాలయాన్ని కొనసాగించనున్న చైనా
Taliban to Announce New Government In Afghanistan Today

ఆఫ్ఘనిస్థాన్ ను కైవసం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈరోజు తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముస్లింలకు శుక్రవారం పవిత్రమైన రోజు అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. నాటో బలగాలతో రెండు దశాబ్దాల పోరాటం తర్వాత తాలిబన్లు మరోసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు. అయితే తాలిబన్లకు అంతర్జాతీయ సమాజం నుంచి ఇంత వరకు మద్దతు లభించలేదు. కేవలం చైనా, పాకిస్థాన్, ఖతార్ మాత్రమే వారి నాయకత్వాన్ని గుర్తించాయి. రష్యా కొంత అనుకూలంగా కనిపిస్తోంది. చాలా దేశాలు వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి.

మానవ హక్కులను కాపాడటం, మహిళల స్వేచ్ఛ తదితర అంశాలలో తాలిబన్ ప్రభుత్వం వ్యవహరించే తీరును బట్టి సంబంధాలను ఏర్పరుచుకోవాలనే ధోరణిలో ఇతర దేశాలు ఉన్నాయి. మరోవైపు తాలిబన్ అధికార ప్రతినిధి ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఆఫ్ఘనిస్థాన్ లో తమ రాయబార కార్యాలయాన్ని కొనసాగిస్తామని చైనా విదేశాంగ శాఖ తెలిపిందని చెప్పారు. తమ ప్రభుత్వంతో సంబంధాలను నెలకొల్పుతామని చెప్పిందని తెలిపారు.

More Telugu News