India: కశ్మీర్​ వేర్పాటువాదాన్ని ముందుండి నడిపిన ప్రముఖ నేత గిలానీ మృతి

  • అనారోగ్యంతో తుదిశ్వాస
  • కొన్నేళ్లుగా బయటకు రాని గిలానీ
  • హైదర్ పురాలో భారీ బందోబస్తు
  • హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా సేవలు
Kashmir Separatist Syed Geelani Dies In Sri Nagar

కశ్మీర్ వేర్పాటు వాద ప్రముఖ నేత సయ్యద్ అలీ షా గిలానీ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి 10.35 గంటలకు శ్రీనగర్ లోని హైదర్ పురాలో ఉన్న ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

అనారోగ్యం కారణంగా కొన్నేళ్లుగా ఆయన బయటకు రావట్లేదు. ఆయన మరణంతో హైదర్ పురాలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అధికారులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారని స్థానికులు చెబుతున్నారు. సయ్యద్ అలీ షా గిలానీ 1929 సెప్టెంబర్ 29న జన్మించారు. జమాత్ ఈ ఇస్లామీ కశ్మీర్ సభ్యుడిగా ఉన్న ఆయన.. తదనంతర కాలంలో తెహ్రీక్ ఈ హురియత్ సంస్థను స్థాపించారు.


ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కు చైర్మన్ గా ఉన్నారు. ఆ తర్వాత 2020 జూన్ లో హురియత్ కాన్ఫరెన్స్ నుంచి తప్పుకున్నారు. సొపోర్ నియోజకవర్గం నుంచి 1972, 1977, 1987లలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. అప్పటి నుంచి గృహ నిర్బంధంలోనే ఉన్నారు.

కాగా, ఆయన మరణంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం కలచివేసిందన్నారు. ఆయన సిద్ధాంతాలను తాను వ్యతిరేకించినా.. తన విశ్వాసాలు, నమ్మకాల పట్ల పట్టుదలగా ఉండడం ప్రశంసించదగిన విషయమన్నారు.

More Telugu News