Farmer: చిత్తూరు జిల్లాలో విడ్డూరం... తన పిల్లలకు దేశాల పేర్లు పెట్టిన రైతు

  • మాంబేడులో వింత రైతు
  • ఐదుగురు పిల్లలకు వినూత్నంగా నామకరణం
  • పెద్ద కుమార్తెకు చైనా రెడ్డి అని నామకరణం
  • చిన్న కొడుక్కి జపాన్ అని పేరు పెట్టిన వైనం
Chittoor farmer christened his children with countries names

చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామంలో నివసించే చంద్రశేఖర్ రెడ్డి ఓ రైతు. ఆయన భార్య పేరు ధనలక్ష్మి. వారికి ఐదుగురు పిల్లలు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ పిల్లల పేర్లు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆ రైతు తన పిల్లలకు వివిధ దేశాల పేర్లు పెట్టాడు మరి. తన బిడ్డల పేర్లు వినూత్నంగా ఉండాలని చంద్రశేఖర్ రెడ్డి దేశాల పేర్లు ఎంచుకున్నాడు. పెద్ద కుమార్తె 2005లో జన్మించగా, ఆమెకు చైనా రెడ్డి అని నామకరణం చేశాడు.

మొదట్లో భార్య ధనలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు ఇదేం పేరని వ్యతిరేకత వ్యక్తం చేసినా, చంద్రశేఖర్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత పుట్టిన కొడుక్కి మరింత విడ్డూరంగా రైనా రెడ్డి అని పేరు పెట్టాడు. దాంతో కుటుంబ సభ్యులు కూడా ఈ తరహా పేర్లకు అలవాటుపడ్డారు. ఇక మూడో సంతానం అమ్మాయి పుట్టగా రష్యా రెడ్డి అని, నాలుగోసారీ అమ్మాయే పుడితే ఇటలీ రెడ్డి అని నామకరణం చేశాడు. ఐదో సంతానం అబ్బాయి జన్మించగా, ముందే సిద్ధం చేసుకున్న జపాన్ రెడ్డి అనే పేరు పెట్టేశాడు.

వీళ్ల ఆధార్ కార్డుల్లో కూడా ఇవే పేర్లు ఉంటాయి. మొదట్లో స్కూల్లో ఉపాధ్యాయులు, ఇతర పిల్లలు కూడా చంద్రశేఖర్ రెడ్డి పిల్లల పేర్లు విని విస్మయానికి గురయ్యారట. కొంతకాలం తోటిపిల్లలు ఎగతాళి చేసినా, క్రమంగా అందరూ ఆ పేర్లకు అలవాటు పడిపోయారు. చంద్రశేఖర్ రెడ్డి పెద్దకుమార్తె చైనా రెడ్డి తిరుపతిలో ఇంటర్ సెకండియర్ చదువుతుండగా, రైనా రెడ్డి పుత్తూరు గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మిగిలిన ముగ్గురు పిల్లలు మాంబేడులో చదువుకుంటున్నారు.

తాను ఈ విధంగా పేర్లు పెట్టినందువల్ల ఎవరికీ ఇబ్బంది లేదని రైతు చంద్రశేఖర్ రెడ్డి అంటున్నాడు. ఈ పేర్లతో పిలిపించుకునేందుకు తన పిల్లలు ఎలాంటి నామోషీగా భావించరని తెలిపాడు.

More Telugu News