'బిచ్చగాడు 2'కి హీరోనే సంగీత దర్శకుడు!

01-09-2021 Wed 18:15
  • 'బిచ్చగాడు'తో హీరోగా గుర్తింపు
  • రీసెంట్ గా మొదలైన సీక్వెల్
  • దర్శకుడిగా ప్రియా కృష్ణస్వామి
  • తన సినిమాకి తనే సంగీత దర్శకుడు
Vijay Antony movie update
తమిళంలోనే కాదు తెలుగులోను విజయ్ ఆంటోనికి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కథాకథనాల్లోను .. పాత్రల విషయంలోను ఆయన చూపించే వైవిధ్యమే అందుకు కారణం. విజయ్ ఆంటోని సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే పట్టుదలతో ఆ దిశగా అడుగులు వేశాడు.

ఈ నేపథ్యంలో ఆయన నటించిన 'బిచ్చగాడు' సినిమా తమిళంతో పాటు తెలుగులోను భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆయన హీరోగానే వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఈ క్రమంలో 'బిచ్చగాడు' స్థాయిలో ఏ సినిమా హిట్ కాకున్నా తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు.

ఆయన తాజా చిత్రంగా 'బిచ్చగాడు 2' రూపొందుతోంది. ఈ సినిమాను ఆయన నిర్మించడమే కాకుండా, సంగీతాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడట. 'బిచ్చగాడు' స్థాయిలో ఈ సినిమా విజయవంతం కావాలనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. మొదటిభాగాన్ని శశి తెరకెక్కించగా, ఈ సినిమాకి ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు.