రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది: ధూళిపాళ్ల

01-09-2021 Wed 14:28
  • సంగం డెయిరీ అంశంలో హైకోర్టు తీర్పు
  • డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు
  • తీర్పును స్వాగతిస్తున్నామన్న ధూళిపాళ్ల
  • పాడిరైతులే గెలిచారని వెల్లడి
Dhulipalla Narendra reacts on High Court verdict over Sangam Dairy
సంగం డెయిరీ కేసులో హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో టీడీపీ నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పందించారు. సంగం డెయిరీ అంశంలో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైందని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై పాడిరైతులు సాధించిన విజయం అని అభివర్ణించారు. డెయిరీని తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించిన సర్కారుకు ఈ తీర్పుతో అడ్డుకట్ట పడిందని ధూళిపాళ్ల అన్నారు.

సంగం డెయిరీ కేసులో ఏపీ సర్కారు దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు ధర్మాసనం, ఇంప్లీడ్ పిటిషన్లను కూడా కొట్టివేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దంటూ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.