COVID19: కరోనా మహమ్మారికి విరుగుడుగా పాము విషం!.. బ్రెజిల్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

  • వైరస్ ను చంపేసిన జరాకుసు విషంలోని పెప్టైడ్
  • ల్యాబ్ లోనూ తయారు చేసేందుకు వీలు
  • త్వరలోనే మనుషులపై ప్రయోగం
This Snake Venom Is The tool To Kill Corona Virus

కరోనా మహమ్మారిని తరిమేసేందుకు రకరకాల చికిత్సలను అప్పట్లో అందుబాటులోకి తెచ్చారు. డెక్సామెథజోన్ నుంచి రెమ్ డెసివిర్ దాకా ఎన్నెన్నో ఔషధాలను సూచించారు. ఆ తర్వాత వ్యాక్సిన్లూ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఓ పాము విషమే కరోనా మహమ్మారికి విరుగుడు అని బ్రెజిల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

జరారాకుసు పిట్ వైపర్ (ఓ రకం పింజర) అనే పాములోని విషంలో ఉండే పదార్థం.. కరోనా వైరస్ ను చంపుతుందని యూనివర్సిటీ ఆప్ సావో పాలో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోతుల్లో కరోనాను ఇది 75 శాతం వరకు నాశనం చేసిందన్నారు.

ఆ పాము విషంలోని పెప్టైడ్ లేదా అమైనో యాసిడ్స్ గొలుసు.. కరోనా వైరస్ లోని కొమ్ముల్లో ఉండే పీఎల్ ప్రో అనే ఎంజైమ్ తో చర్య జరుపుతుందని, తద్వారా కరోనా వైరస్ వృద్ధి చెందకుండా అడ్డుకుంటుందని గుర్తించారు. దీని వల్ల మనిషిలోని ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని ఉండదని తేల్చారు.


యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్న ఈ పెప్టైడ్ ను ల్యాబ్ లో తయారు చేయడమూ సులభమేనని చెప్పారు. తద్వారా ఆ పాములను పెంచడం లేదా పట్టుకోవడం అవసరం వుండదని చెప్పారు. ప్రస్తుతం ఈ విషంతో కలిగే ప్రయోజనాలు, దుష్ఫలితాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. వివిధ డోసుల్లో కరోనాపై ఆ విషం ప్రభావశీలతను తెలుసుకోనున్నారు. త్వరలోనే మనుషులపై ప్రయోగాలు చేస్తామని వారు చెబుతున్నారు.

కాగా, జరాకుసు పాములు బ్రెజిల్ లో పొడవైన పాముల్లో ఒక రకం. ఆ పాము దాదాపు 6 అడుగుల దాకా పెరుగుతుంది. బ్రెజిల్ తో పాటు అట్లాంటిక్ ఫారెస్ట్ తీర ప్రాంతం, బొలీవియా, పరాగ్వే, అర్జెంటీనాల్లోనూ ఈ పాములు కనిపిస్తుంటాయి.

More Telugu News