KCR: నాపై పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం.. కేసీఆర్, హరీశ్‌రావులకు ఈటల సవాల్

Etela Rajender Dares KCR and Harish Rao
  • కేసీఆర్ ధర్మంతో పెట్టుకున్నారు
  • టీఆర్ఎస్ పరిస్థితి ఆరిపోయే దీపంలా ఉంది
  • కేసీఆర్‌తో అనుబంధం వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానన్న ఈటల 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత రాత్రి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, దమ్ముంటే తనతో పోటీకి దిగాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులకు సవాలు విసిరారు. అదే వారు కనుక ఓడిపోతే రాజీనామా చేయాలని అన్నారు. తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నానని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వాటిముందు ఫలించవని అన్నారు.

బెదిరింపులు, అహంకారం, డబ్బులతో హుజూరాబాద్‌లో పరిస్థితిని అటుదిటు మార్చడం కేసీఆర్ జేజమ్మ తరం కూడా కాదన్నారు. బక్కపల్చగా ఉన్న ఈటల అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడని, ధర్మం కోసం, న్యాయం కోసం దేన్నైనా త్యాగం చేసే సత్తా ఉన్నోడని ఈటల అన్నారు. ధర్మంతో పెట్టుకున్న కేసీఆర్‌ కు పతనం తప్పదని హెచ్చరించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని, రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఇదేనని అన్నారు. కేసీఆర్‌తో తనకు 18 సంవత్సరాల అనుబంధం ఉందని, కాబట్టే ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని అన్నారు. రాజీనామా చేయమంటే ముఖం మీద కొట్టి వచ్చానని ఈటల పేర్కొన్నారు.
KCR
Etela Rajender
Huzurabad
BJP
TRS

More Telugu News