Sayed Sadaat: పిజ్జాలు డెలివరీ చేయడాన్ని నామోషీగా భావించడంలేదు: జర్మనీలో ఆఫ్ఘన్ మాజీ మంత్రి

  • గతంలో మంత్రిగా పనిచేసిన సదాత్
  • ఆఫ్ఘన్ క్యాబినెట్ లో కమ్యూనికేషన్ మంత్రిగా విధులు
  • అవినీతిని వ్యతిరేకించిన వైనం
  • దేశాన్ని వీడి జర్మనీ చేరిక
Afghan former minister Sayed Sadaat opines on his pizza delivery duties

సయ్యద్ సదాత్... ఒకప్పుడు ఆయన ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంలో కమ్యూనికేషన్ శాఖ మంత్రి. కానీ ఇప్పుడు జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘన్ ను తాలిబన్లు ఆక్రమించడంతో సదాత్ విషయం వెలుగులోకి వచ్చింది. సదాత్ 2016 నుంచి 2018 వరకు ఆఫ్ఘన్ మంత్రిగా పనిచేశారు. అయితే, ప్రభుత్వంలో అవినీతి పెచ్చుమీరడంతో ఆయన పదవి నుంచి తప్పుకుని ఆఫ్ఘనిస్థాన్ ను వీడారు. 50 ఏళ్ల సదాత్ ఉపాధి కోసం పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.

"పిజ్జాలు, ఇతర ఆహార పదార్థాలను డెలివరీ ఇవ్వడంలో సిగ్గుపడాల్సిందేమీ లేదు. ఇది కూడా ఒక పని అంతే. ఒకచోట ఒక ఉద్యోగం ఉందంటే అక్కడ గిరాకీ ఉందన్నమాట. ఎవరో ఒకరు ఆ ఉద్యోగం చేయకతప్పదు కదా" అని వివరించారు. తాను ఆఫ్ఘన్ ను ఎందుకు వీడాల్సి వచ్చిందో కూడా సయ్యద్ సదాత్ వెల్లడించారు.

"నేను మంత్రిగా పనిచేసిన కాలంలో అధ్యక్షుడి సన్నిహితవర్గానికి, నాకు విభేదాలు వచ్చాయి. వాళ్లు సొంత ప్రయోజనాల కోసం ఒత్తిడి చేసేవారు. కానీ, నేను మాత్రం నిధులను ప్రభుత్వ ప్రాజెక్టులకు వినియోగించడానికే మొగ్గు చూపాను. ఆ విధంగా వారిని సంతృప్తి పర్చలేకపోయాను. దాంతో వారు నన్ను క్యాబినెట్ నుంచి తొలగించేందుకు అధ్యక్షుడి ద్వారా ఒత్తిడి తీసుకువచ్చారు.

అయితే, నేనే పదవి నుంచి తప్పుకుని ఆఫ్ఘనిస్థాన్ లోనే టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఓ ఉద్యోగం చూసుకున్నాను. అయితే 2020 నుంచి ఆఫ్ఘన్ లో పరిస్థితులు క్షీణించడం మొదలుపెట్టాయి. దాంతో దేశం వీడాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపారు. బ్రిటన్ పౌరసత్వం ఉన్నా, జర్మనీలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయని అక్కడకి వెళ్లినట్టు సయ్యద్ సదాత్ వెల్లడించారు.

More Telugu News