IPL: మరో 20 రోజుల్లో ఐపీఎల్​ రెండో అర్ధ భాగం.. ఆర్సీబీకి గట్టి దెబ్బ

  • గాయంతో మిగతా మ్యాచ్ లకు వాషింగ్టన్ సుందర్ దూరం
  • అతడి స్థానంలో ఆకాశ్ దీప్ కు అవకాశం
  • ఆర్సీబీకి నెట్ బౌలర్ గా ఉన్న మీడియం పేసర్
  • ముంబై, సీఎస్కే మ్యాచ్ తో వచ్చే నెల 19న రెండో భాగం మొదలు
Shocker For RCB Ahead Of Second Part Of IPL in 20 Days

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ రెండో అర్ధభాగానికి దూరమయ్యాడు. కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 19 నుంచి మిగతా భాగం నిర్వహణకు రెండు నెలల క్రితమే బీసీసీఐ షెడ్యూల్ ను విడుదల చేసింది.

అయితే, ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపికై అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ లో సుందర్ గాయపడ్డాడు. ఇంకా అతడు కోలుకోలేదు. దీంతో మిగతా మ్యాచ్ లన్నింటికీ అతడు అందుబాటులో ఉండడని ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. అతడి స్థానంలో బెంగాల్ కు చెందిన ఆకాశ్ దీప్ అనే యువ ఆటగాడికి అవకాశమిచ్చింది. మీడియం పేసర్ అయిన 24 ఏళ్ల ఆకాశ్.. ఆర్సీబీకి నెట్ బౌలర్ గా సేవలందిస్తున్నాడు.

ఈ ఏడాది సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో భాగంగా ఆకాశ్ దీప్ ఐదు మ్యాచ్ లలో 19.28 సగటుతో ఏడు వికెట్లు పడగొట్టాడు. బెంగాల్ తరఫున ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా 15 టీ20ల్లో 21 వికెట్లు తీశాడు. యువ ఆటగాళ్లలో ప్రతిభను వెలికితీసేందుకు ఆర్సీబీ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుందని యాజమాన్యం తెలిపింది.


కాగా, వాయిదా పడిన ఐపీఎల్  మిగతా మ్యాచ్ లు ముంబై, సీఎస్కే మధ్య మ్యాచ్ తో సెప్టెంబర్ 19న పున: ప్రారంభం కానున్నాయి. దుబాయ్, అబుధాబి వేదికలుగా మ్యాచ్ లు జరగనున్నాయి. అక్టోబర్ 15న ఫైనల్ ను నిర్వహిస్తారు.

More Telugu News