Nitish Kumar: అంతా నాన్సెన్స్... ఆ కోరిక నాకు లేదు: నితీశ్ కుమార్

  • పీఎం రేసులో నితీశ్ ఉన్నారంటూ వార్తలు
  • ఆ పదవిని ఆశించలేదన్న నితీశ్
  • ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జేడీయూ
I dont have desire to become PM says Nitish Kumar

దేశ రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. రానున్న సాధారణ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించి, వరుసగా మూడో సారి అధికారపీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. మరోవైపు విపక్షపార్టీలను ఏకంచేసి బీజేపీ పాలనకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా కాంగ్రెస్ తరపున రంగంలోకి దిగారు. ఆయన అప్పుడే గ్రౌండ్ వర్క్ ని ప్రారంభించారని తెలుస్తోంది. ఈ క్రమంలో పీఎం అభ్యర్థికి పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు ఊహించని విధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరు చర్చనీయాంశంగా మారింది.

జాతీయ రాజకీయాల్లో కీలక నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నితీశ్ కుమార్ కు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో ఆయన కీలక భూమికను పోషించారు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయనకు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. తాజాగా ఆయన కూడా ప్రధాని రేసులో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ అంశంపై జేడీయూ క్లారిటీ ఇచ్చింది. ప్రధాని అయ్యేందుకు కావాల్సిన అన్ని లక్షణాలు, అర్హతలు నితీశ్ కు ఉన్నాయని... కానీ, పీఎం రేసులో ఆయన లేరని తెలిపింది. ఇదే అంశంపై నితీశ్ కుమార్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇదంతా నాన్సెన్స్ అని ఆయన కొట్టిపారేశారు. ప్రధాని కావాలని తానెప్పుడూ కోరుకోలేదని, ఆ పదవిని ఆశించలేదని స్పష్టం చేశారు.

More Telugu News