నన్ను తిట్టిన వాళ్లకు శివసేన ప్రమోషన్ ఇస్తోంది: కేంద్రమంత్రి రాణే

29-08-2021 Sun 16:32
  • ఇటీవల మహారాష్ట్రలో రాణే అరెస్ట్
  • సీఎంపై వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలపై అరెస్ట్
  • బెయిల్ పై విడుదలైన రాణే
  • తనపై కుట్రలు ఇక సాగవని స్పష్టీకరణ
Narayan Rane verbal attacks on Shiv Sena leaders again
కేంద్రమంత్రి నారాయణ్ రాణే మరోసారి మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తనను తిట్టిన వారికి శివసేన పార్టీ ప్రోత్సాహకాలు ఇస్తోందని, వారికి పదోన్నతులు కల్పిస్తోందని మండిపడ్డారు. కాగా, ఇటీవల తనను అరెస్ట్ చేయడాన్ని ఓ దుశ్శకునం అని అభివర్ణించారు. తాను చేపట్టిన జన ఆశీర్వాద యాత్రకు భంగం కలిగించడమే అరెస్ట్ వెనుక ముఖ్య ఉద్దేశం అని ఆరోపించారు. మహారాష్ట్రలోని సింధు దుర్గ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"మంత్రుల వ్యవహార శైలి చూస్తుంటే నన్ను అరెస్ట్ చేయాలని రాష్ట్రపతే ఆదేశించాడన్నట్టుగా ఉంది. నా యాత్రను అడ్డుకోవడానికే వారి ప్రయత్నాలు. కానీ వారి కుట్రలు సాగవు. మహారాష్ట్రలోని ప్రతి జిల్లాలోనూ నేను యాత్ర సాగిస్తా. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రతి ఒక్కరికీ వివరిస్తా" అని నారాయణ్ రాణే స్పష్టం చేశారు.

ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ లేదని, ప్రజలకు ఉపాధి లేక అలమటిస్తున్నారని అన్నారు. ఇక, బీజేపీలో చేరాలనుకునే శివసైనికులకు తాము స్వాగతం పలుకుతున్నామని వెల్లడించారు.