TDP: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై లోకాయుక్త నివేదిక.. ఓ అంశంలో క్లీన్ చిట్!

  • పన్నుల శాఖలో పదోన్నతులు పొందొచ్చు
  • ఈ విషయంలో అశోక్‌బాబు ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు
  • తనకు డిగ్రీ ఉన్నట్టు చెప్పడం మాత్రం దురుద్దేశపూరితమే
Lokayukta report on TDP MLC Ashok Babu

టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు పి. అశోక్‌బాబు సర్వీసు రికార్డుల తారుమారుపై విచారణ చేపట్టిన లోకాయుక్త ఓ విషయంలో క్లీన్ చిట్ ఇవ్వగా, మరో దాంట్లో తప్పుబట్టింది. సర్వీసు రికార్డుల తారుమారుపై సీబీసీఐడీతో దర్యాప్తు చేయించాలని వాణిజ్య పన్నులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై సీబీసీఐడీకి ఫిర్యాదు చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వాటిలో పేర్కొన్నారు. దీంతోపాటు కర్ణాటకలో ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన విషయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

లోకాయుక్త ఆదేశాల మేరకు వాణిజ్య పన్నులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విచారణ చేపట్టారు. తాజాగా అందుకు సంబంధించిన నివేదికను లోకాయుక్తకు సమర్పించారు. వాణిజ్య పన్నుల శాఖ రికార్డుల్లో తనకు బీకాం డిగ్రీ ఉందని అశోక్ బాబు పేర్కొన్న మాట నిజమేనని నిర్ధారించారు. అలాగే, పన్నుల శాఖలో ఏసీటీవో, డీసీటీవో పదోన్నతులు పొందొచ్చని, కాబట్టి ఈ శాఖకు రావడానికి ప్రయత్నాలు చేశారని నోట్‌ఫైళ్ల పరిశీలన ద్వారా రుజువైందని అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో అశోక్‌బాబు ఎలాంటి ప్రయోజనం పొందలేదని నివేదిక స్పష్టం చేసింది. అయితే, అశోక్‌బాబు తనకు డిగ్రీ ఉన్నట్టు చెప్పడం మాత్రం దురుద్దేశపూరితమేనని పేర్కొంది.

More Telugu News