Bandi Sanjay: తెలంగాణలో రావణరాజ్యం.. బండి సంజయ్ పాదయాత్రతో అంతం: తరుణ్‌చుగ్

KCR Regime Ends With Bandi sanjay Praja Sangrama Yatra
  • గాంధీ యాత్రతో బ్రిటిషర్లు, మిషన్ పోలోతో నిజాం పాలన అంతమైంది
  • టీఆర్ఎస్ జానేవాలా.. బీజేపీ ఆనేవాలా తథ్యం
  • ప్రజల ఆకాంక్షలు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో బందీ: డీకే అరుణ
బండి సంజయ్ పాదయాత్రతో తెలంగాణలోని రావణరాజ్యం అంతమవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌చుగ్, అరుణ్‌సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిన్న చార్మినార్ వద్ద నిర్వహించిన సభలో వీరు మాట్లాడారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో రావణరాజ్యం సాగుతోందని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం 3 లక్షల ఇళ్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీసం లక్ష ఇళ్లు కూడా నిర్మించలేదని దుయ్యబట్టారు. భవిష్యత్‌లో ‘టీఆర్ఎస్ జానేవాలా.. బీజేపీ ఆనేవాలా’ తప్పదన్నారు. మహాత్మాగాంధీ యాత్రతో బ్రిటిషర్ల పాలన, మిషన్ పోలోతో నిజాం పాలన అంతమైందని, ఇప్పుడు బండి సంజయ్ పాదయాత్రతో కేసీఆర్ పాలన అంతమవుతుందని అన్నారు.

పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో బందీ అయ్యాయని విమర్శించారు. కాగా, నేడు రెండో రోజు పాదయాత్ర 9 గంటలకు ప్రారంభం అవుతుంది. నానల్‌నగర్ చౌరస్తా, టోలిచౌకి చౌరస్తా, షేక్‌పేట నాలా మీదుగా షేక్‌పేట చేరుకుంటుంది. బండి సంజయ్ మధ్యాహ్న భోజనం అక్కడే చేస్తారు. అనంతరం గోల్కొండ చేరుకుని సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి సభలో ప్రసంగిస్తారు. తర్వాత గోల్కొండ చోటా బజార్, లంగర్‌హౌస్ చెరువుకట్ట, లంగర్‌హౌస్ చౌరస్తా మీదుగా బాపూఘాట్‌కు పాదయాత్ర చేరుకుంటుంది. రాత్రికి అక్కడికి సమీపంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చేస్తారు.
Bandi Sanjay
Tarun Chugh
DK Aruna
Praja Sangrama Yatra

More Telugu News