Fake baba: జమ్మూకశ్మీర్‌లో భూమి అంటూ రూ.కోటి మోసం.. నకిలీ బాబా అరెస్టు!

Fake baba dupes elderly promising land deal in Jammu Kashmir
  • ఇంట్లో పూజా కార్యక్రమాలు చేస్తూ నమ్మకం పెంచుకున్న మోసగాడు
  • ఆర్టికల్ 370 రద్దుతో భూముల విలువలు పెరుగుతాయని అబద్ధాలు
  • బ్లాంక్ చెక్కులు తీసుకొని రూ.1.25 కోట్లు దోచుకున్న వైనం
ఢిల్లీలోని ఒక వృద్ధ దంపతుల ఇంట్లో పండుగలు, ఫంక్షన్లలో పూజలు చేస్తూ నమ్మకం పెంచుకున్నాడా నకిలీ బాబా. అలా ఆ కుటుంబంతో బాగా స్నేహం పెరిగిన తర్వాత తన పథకం అమలు చేశాడు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దయిందని, కాబట్టి త్వరలోనే అక్కడి భూములను అందరూ కొనుగోలు చేయొచ్చని చెప్పాడు.

భవిష్యత్తులో ఆ భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని, ఇప్పుడే కొనుక్కుంటే మంచిదని అన్నాడు. వాళ్లకు ఆసక్తి ఉంటే తాను సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అతని మాటలు నమ్మి భూములు కొనడానికి ఆ దంపతులు అంగీకరించారు. అలా వాళ్ల దగ్గర బ్లాంక్ చెక్కులు తీసుకున్న ఆ నకిలీ బాబా పేరు నరేశ్ కుమార్. భూముల కొనుగోలు కోసం అంటూ రూ.1.25 కోట్లను నరేష్ తన బ్యాంకు ఖాతాకు, తన కుటుంబ సభ్యుల ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.

ఇదంతా జరిగిన తర్వాత కానీ తాము మోసపోయామని ఆ దంపతులు తెలుసుకోలేకపోయారు. ఆ వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు జరిపారు. అయితే అప్పటికే పోలీసులకు దొరక్కుండా నరేశ్ తప్పించుకున్నాడు. చివరికి అతను జమ్మూలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

 వెంటనే రంగంలోకి దిగిన ఖాకీలు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో నిందితుడిని హాజరుపరచి, విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించారు. నరేశ్ ఇలా ఈ కుటుంబం వద్ద మాత్రమే డబ్బు దోచుకున్నాడా? లేక ఇంకా ఎవర్నైనా మోసం చేశాడా? అని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే దోచుకున్న సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
Fake baba
Jammu And Kashmir
land deal
New Delhi

More Telugu News