డిగ్రీ ఫస్టియర్​ విద్యార్థినిపై ముగ్గురు స్నేహితుల అఘాయిత్యం.. చోద్యం చూసిన స్నేహితురాలు!

  • మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో దారుణం
  • టూర్ కు తీసుకెళ్లి అత్యాచారం, దాడి
  • మరో స్నేహితురాలి సాయంతో బాధితురాలి ఫిర్యాదు
Three Friends Rape First Year Graduation Student While Her Woman Friend watching

వారంతా ఒకే కాలేజీలో చదువుతున్న స్నేహితులు. టూర్ కు వెళ్దామని చెప్పి ఆ అమ్మాయిని వెంట తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపిచ్చి.. ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వెంట వెళ్లిన బాధితురాలి స్నేహితురాలు కాపాడాల్సిందిపోయి చోద్యం చూసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా మండూలో జరిగింది.  

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన స్నేహితురాలు పూజా నర్వారియా, ఆశిష్, నిపుల్, పునీత్ లపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇండోర్ లో డిగ్రీ చదువుతున్న బాధితురాలి వద్దకు వచ్చిన పూజ.. ఆశిష్, నిపుల్, పునీత్ లతో కలిసి మండూకు వెళ్దామని చెప్పింది. వెళ్లాక, మండూ నుంచి సాయంత్రం 4 గంటలకు వారంతా తిరుగు పయనమయ్యారు.

ఆ సమయంలో ఆశిష్ మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ను బాధితురాలికి ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన ఆమెను స్కీమ్ నంబర్ 56 ప్రాంతంలోని ఆశిష్ అద్దె ఫ్లాట్ కు తీసుకెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో బాధితురాలికి మెలకువ రాగా.. ఆశిష్, నిపుల్, పునీత్ లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అఘాయిత్యానికి అడ్డుపడాల్సింది పోయి.. పూజ చోద్యం చూస్తూ ఉండిపోయింది. అంతేకాదు, ఆ ఘటనను నిందితులు వీడియో కూడా తీశారు. తర్వాత ఆ నలుగురు కలిసి ఆమెను తీవ్రంగా కొట్టారు. ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియో లీక్ చేస్తామని బెదిరించారు.

తర్వాత బాధితురాలు తన మరో స్నేహితురాలికి జరిగిన అఘాయిత్యం గురించి చెప్పడంతో.. ఆమె బాధితురాలి తల్లిదండ్రులకు విషయాన్ని వివరించింది. వారు లాసూదియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు.. గ్యాంగ్ రేప్ కేసును నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News