TRS: సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే!

  • తెలంగాణ భవన్ లో రాష్ట్ర కమిటీ భేటీ
  • పలు కీలక ప్రతిపాదనలకు కేసీఆర్ ఆమోదం
  • త్వరలో ద్విదశాబ్ది ఉత్సవాలు
  • నవంబరులో కానీ, డిసెంబరులో కానీ పార్టీ ప్లీనరీ
TRS Party state committee meeting

హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు దశాబ్దాల పార్టీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నవంబరులో కానీ, డిసెంబరులో కానీ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

మండల, మున్సిపల్, జిల్లా కమిటీలతో సహా టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం సెప్టెంబరు నాటికి పూర్తిచేయాలని సంకల్పించారు. సీనియర్ నేత కె.కేశవరావు పార్టీ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 2న పంచాయతీ కమిటీలను ప్రకటించనున్నారు.

విజయదశమి అనంతరం అక్టోబరులో జిల్లాల్లోని టీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. అయితే, హైదరాబాద్, వరంగల్ జిల్లాల పార్టీ కార్యాలయాలను అందుకు మినహాయించారు. ఇక ఆగస్టు చివరినాటికి పార్టీ సభ్యత్వాల నమోదు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

More Telugu News