NASA: ‘నాసా’ పేరిట మోసం: 14 ఏళ్ల బాలికపై విపరీతమైన ట్రోలింగ్

  • నాసాకు ఎంపికైనట్లు మహారాష్ట్ర బాలికకు ధ్రువపత్రాలు
  • వీడియోలో పలు అక్షర దోషాలను గుర్తించిన నెటిజన్లు
  • ముందుకొచ్చిన న్యూయార్క్ సైంటిస్ట్
  • బాలిక మోసపోయిందన్న జాకీ ఫాహెర్టీ
NASA scam Extreme trolling on 14yearold girl

మహారాష్ట్రలోని ఔరంగాబాదుకు చెందిన 14 ఏళ్ల దీక్షా షిండే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఫెలోషిప్ కు ఎంపికైందని పేర్కొంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి విదితమే. అయితే, ఈ వార్తలు ఒట్టి నకిలీ అని తాజాగా వెల్లడైంది. ఆమెకు అందిన సర్టిఫికెట్‌ వీడియోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఈ సర్టిఫికెట్లలో జాకీ ఫాహెర్టీ అనే న్యూయార్క్ శాస్త్రవేత్త పేరు కూడా ఉంది.

ఈ క్రమంలో సదరు శాస్త్రవేత్త ఫాహెర్టీ స్పందిస్తూ.. ‘‘నా పేరు దీంతో ఎందుకు ముడిపడిందో తెలీదు. కానీ సైంటిస్టు అవ్వాలని కలలు కంటున్న 14 ఏళ్ల భారతీయ బాలికను అడ్డుపెట్టుకొని ఎవరో సృష్టించిన మోసం ఇది. దీక్షకు కనుక నిజంగానే ఖగోళశాస్త్రంపై అంత మక్కువ ఉంటే.. నన్ను సంప్రదించమని చెబుతున్నా. ఆమె కల నెరవేరడానికి నాకు చేతనైనంత సాయం చేస్తా’’ అంటూ ట్వీట్ చేశారు.

నాసాకు చెందిన ఎమ్ఎస్ఐ ఫెలోషిప్ వర్చువల్ ప్యానెల్‌లో దీక్ష ఎంపికైందని వార్తలొచ్చాయి. తాను కృష్ణబిలాలు, దేవుడు అనే అంశంపై థియరీ రాశానని, మూడోసారి దీనికి నాసా అంగీకారం దక్కిందని దీక్ష అప్పట్లో చెప్పింది. నాసా వెబ్‌సైట్‌కు ఆర్టికల్స్ రాయాలని తనను వాళ్లు కోరినట్లు వెల్లడించింది. అయితే ఆ తర్వాత ఈ వార్తలపై పలువురు సందేహాలు వ్యక్తంచేశారు.

ఇక దీక్షకు వచ్చిన సర్టిఫికెట్లలో అక్షరదోషాలు ఉన్నాయని కొందరంటే.. మరికొందరేమో నాసా ఎమ్ఎస్ఐ ఫెలోషిప్ రావాలంటే అమెరికా పౌరులై ఉండాలని, లేదంటే కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుండాలని రూల్స్ గుర్తుచేశారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ ఫాహెర్టీని దీనిపై వివరణ కోరగా.. ఆమె అసలు విషయం బయటపెట్టారు. దీంతో దీక్ష మోసగాళ్ల స్కాంకు బలైందని కొందరు సానుభూతి చూపుతున్నారు.

More Telugu News