మీ సినీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం: చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

22-08-2021 Sun 14:05
  • నేడు చిరంజీవి పుట్టినరోజు
  • విషెస్ తెలిపిన చంద్రబాబు, లోకేశ్
  • సమాజంలో ఒక ఒరవడి సృష్టించారన్న చంద్రబాబు
  • స్వయంకృషితో ఎదిగారన్న లోకేశ్
Chandrababu and Lokesh wishes Chiranjeevi on his birthday

ఇవాళ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. 66వ జన్మదినం జరుపుకుంటున్న ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా చిరంజీవికి విషెస్ తెలిపారు.

పద్మభూషణ్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాశీస్సులు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. పట్టుదలతో పైకెదిగిన మీ సినీ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. మీ సేవా కార్యక్రమాలతో సమాజంలో ఒక ఒరవడి సృష్టించారని పేర్కొన్నారు. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.

అటు, లోకేశ్ స్పందిస్తూ... తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగారని, తన నటనా ప్రావీణ్యంతో ఉన్నతస్థానానికి ఎదిగారని చిరంజీవిని కీర్తించారు. లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీరు చిరకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను అని వివరించారు.