Jagan: చిన్నారి అండగా సీఎం.. చికిత్సకు రూ.17.5 లక్షల సాయం అందించిన జగన్

  • జన్యుపరమైన లివర్ సమస్యతో బాధపడుతున్న చిన్నారి
  • చెన్నైలోని ఆసుపత్రిలో క్లిష్టమైన శస్త్రచికిత్స
  • విషయం తెలిసిన వెంటనే సాయం అందించాలని అధికారులను ఆదేశించిన జగన్
Jagan financial help saves boys life

ముఖ్యమంత్రి జగన్ తక్షణ స్పందనతో ఒక చిన్నారి ప్రాణం నిలిచింది. వివరాల్లోకి వెళ్తే శ్రీకాళహస్తి బీపీ అగ్రహారానికి చెందిన జగదీశ్, లక్ష్మి దంపతులకు మునీశ్వర్ (10) అనే కొడుకు ఉన్నాడు. ఈ చిన్నారికి జన్యుపరమైన లివర్ సమస్య ఉంది. దీని కారణంగా పచ్చ కామెర్లు, ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని కలిసి సహాయం కోరారు. ఆయన వెంటనే స్పందించి చెన్నైలోని గ్లెనిగల్ గ్లోబల్ ఆసుపత్రికి పంపారు.

చిన్నారిని పరీక్షించిన వైద్యులు  క్లిష్టమైన ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని... దీనికి రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే ఎమ్మెల్యే చొరవ, చిన్నారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రూ. 17.5 లక్షలకు ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన జగన్ రూ. 17.5 లక్షలను చెల్లించడానికి అధికారులకు అనుమతి ఇచ్చారు.

అనంతరం వైద్యులు శస్త్రచికిత్సను నిర్వహించారు. తండ్రి నుంచి 20 శాతం కాలేయాన్ని తీసుకుని, దాన్ని చిన్నారికి అమర్చారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి, వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News