Tollywood: మేం ఎవరికీ వ్యతిరేకం కాదు.. మనసు నొచ్చుకుంటే క్షమించండి: తెలుగు సినిమా థియేటర్స్​ అసోసియేషన్​

  • టక్ జగదీశ్ విడుదల వివాదంపై స్పందన
  • బాధతోనే మీడియాతో మాట్లాడారని కామెంట్
  • ఆ సినిమాపై ఎగ్జిబిటర్లకు ఎన్నో అంచనాలున్నాయని వెల్లడి
TCTA Responds Over Tuck Jagadish Controversy

తాము ఎవరికీ వ్యక్తిగతంగాకానీ, వ్యాపారపరంగాకానీ వ్యతిరేకం కాదని, సినీ వ్యాపారంలో ఉన్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుగు సినిమా థియేటర్స్ అసోసియేషన్ (టీసీటీఏ) తెలిపింది. టక్ జగదీశ్ సినిమా విడుదలకు సంబంధించి నిన్న పలువురు ఎగ్జిబిటర్లు నిర్వహించిన మీడియా సమావేశంపై పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

కొన్ని రోజుల పాటు సినిమాను వాయిదా వేయడమో లేదంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మాత్రమే తమ కార్యదర్శి చెప్పారని పేర్కొంది. సినిమా వ్యాపారంలో తాము ఎవరికీ వ్యతిరేకం కాదని తెలిపింది. కరోనా కారణంగా థియేటర్లు చాలా కాలం పాటు మూత పడి ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయారని చెప్పింది. ఈ నేపథ్యంలోనే విడుదలవుతున్న టక్ జగదీశ్ పై వారు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారని పేర్కొంది.

అయితే, ఆ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారన్న సంగతి తెలిసి బాధతో వారు మీడియాతో మాట్లాడారని చెప్పింది. ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదని, ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేసింది. సినిమా వ్యాపారాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తూనే ఉంటామని స్పష్టం చేసింది.

More Telugu News