ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌.. గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన డీజీసీఐ

20-08-2021 Fri 22:25
  • స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్యాడిలా హెల్త్‌కేర్
  • జీకోవ్‌-డీగా నామకరణం
  • మూడు డోసుల వ్యాక్సిన్‌కు డీజీసీఐ అనుమతి
  • వైరస్ జన్యుమార్పులను నిలువరించడం సులభతరం
The world s first DNA based corona vaccine DGCI gave the green signal

ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా మహమ్మారిని నిలువరించడం కోసం తయారు చేసిన డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి లభించింది. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా (క్యాడిలా హెల్త్‌కేర్) తయారు చేసిన ఈ మూడు డోసుల వ్యాక్సిన్‌ ‘‘ప్లగ్ అండ్ ప్లే’’ సాంకేతికత ఆధారంగా తయారైనట్లు ప్రభుత్వానికి చెందిన బయోటెక్నాలజీ విభాగం(బీటీ) పేర్కొంది.

 కరోనా వైరస్‌లో వచ్చే కొత్త జన్యుమార్పులకు (మ్యుటేషన్లకు) అనుగుణంగా ఈ డీఎన్ఏ ప్లాస్మిడ్ కరోనా వ్యాక్సిన్ ప్రతిస్పందిస్తుందని ఈ విభాగం తెలిపింది. ఈ కారణంగా ఇప్పటికే ఉన్న వేరియంట్లతోపాటు భవిష్యత్తులో వచ్చే కొత్త వేరియంట్లను కూడా నిలువరించడంలో ఈ వ్యాక్సిన్ కీలకపాత్ర పోషిస్తుందని అభిప్రాయపడింది. ప్రపంచంలో డీఎన్ఏ ఆధారంగా తయారైన తొలి కరోనా వ్యాక్సిన్ ఇదేనని బీటీ పేర్కొంది.

 జీకోవ్-డి (ZyCoV-D) పేరుతో విడుదల కానున్న ఈ వ్యాక్సిన్‌కు శుక్రవారం నాడు డీజీసీఐ నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్‌ను పూర్తి దేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు తెలుస్తోంది. 12 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చని సమాచారం. డీజీసీఐ అనుమతి లభించిన రెండు నెలల్లో తమ మూడు డోసుల వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని జైడస్ క్యాడిలా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ వ్యాక్సిన్ రెండు డోసుల నియమావళికి సంబంధించిన అదనపు సమాచారం అందించాలని డీజీసీఐ కోరినట్లు సమాచారం.