హిట్​ మ్యాన్​ రోహిత్​ శర్మపై సచిన్ ప్రశంసల వర్షం

20-08-2021 Fri 14:49
  • జట్టును ముందుండి నడిపిస్తున్నాడన్న సచిన్
  • పుల్ షాట్ ను రోహిత్ అంత గొప్పగా ఎవరూ ఆడలేరని కామెంట్
  • అతడి టెక్నిక్ అమోఘమంటూ ప్రశంసలు
Sachin Tendulkar Praises Rohit Sharma For His Best Knock In England Lords Test

టీమిండియా ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా ఆడుతున్నాడంటూ కొనియాడాడు. ఓ లీడర్ లా ముందుకు సాగుతున్నాడని ప్రశంసల జల్లు కురిపించాడు.  

‘‘జట్టును రోహిత్ ముందుండి నడిపిస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆటను మార్చుకుంటూ తనను తాను మరింత వృద్ధి చేసుకుంటున్నాడు’’ అని అన్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అండతో ఓ లీడర్ లా రోహిత్ చెలరేగిపోతున్నాడని మెచ్చుకున్నాడు. రాహుల్ నుంచి రోహిత్ కు అందిన సహకారం చాలా గొప్పగా ఉందన్నాడు.

పుల్ షాట్స్ ఆడడంలో రోహిత్ ను మించిన వారు లేరన్నాడు. రోహిత్ టెక్నిక్ అమోఘమని, షాట్లు ఆడుతూనే బంతిని డిఫెండ్ చేసిన తీరు అద్భుతమని పేర్కొన్నాడు. అతడు ఎప్పటికీ గొప్ప ఆటగాడన్నాడు. ఇంగ్లండ్ లో అతడి ఆట చూశాక.. రోహిత్ మరింత ఎదిగాడనడంలో సందేహం లేదని మాస్టర్ బ్లాస్టర్ చెప్పుకొచ్చాడు.