Telangana: ఇది తెలంగాణకు చారిత్రక ఘట్టం.. నేను కన్న కల 3 నెలల్లోనే నెరవేరడం సంతోషం: సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ ఎన్వీ రమణ

CJI Says International Arbitration Center In Hyderabad is His Dream
  • హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం
  • హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో కార్యక్రమం
  • హాజరైన జస్టిస్ రమణ
  • దీనివల్ల కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని కామెంట్
హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ఏర్పాటు తన కల అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో జరిగిన ఆ కేంద్రం ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎలాంటి వివాదాలు లేని వాతావరణంలో వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతుంటారని, ఏ వివాదాలు లేకుండా ఈ ఆర్బిట్రేషన్ కేంద్రం చూస్తుందని ఆయన చెప్పారు.

ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం జరగడం తెలంగాణకు చారిత్రక ఘట్టం అని అన్నారు. తాను కన్న కల మూడు నెలల్లోనే నెరవేరడం ఆనందదాయకమన్నారు. ఇక్కడ మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆర్బిట్రేషన్ కేంద్ర ఏర్పాటు బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే ఈ కేంద్రం ఏర్పాటుకు చట్టం వచ్చిందని గుర్తు చేశారు.

ప్రపంచంలో తొలిసారిగా 1926లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైందని చెప్పారు. అయితే, మన దగ్గర ఆర్బిట్రేషన్ కేంద్రం లేకపోవడం వల్ల ప్రతిసారీ సింగపూర్, దుబాయ్ కు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆ బాధ తప్పుతుందన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే బాధ కూడా తప్పుతుందన్నారు.
Telangana
CJI
Justice N.V. Ramana
Supreme Court
High Court
TS High Court
Justice Hima Kohli

More Telugu News