Avanthi Srinivas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై మంత్రి ముత్తంశెట్టి స్పందన.. అది నకిలీదన్న మంత్రి!

  • రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన ఆడియో
  • రాత్రి పది గంటల సమయంలో మంత్రి విలేకరుల సమావేశం
  • ఎదుగుదలను చూసి ఓర్వలేకే వ్యక్తిత్వ హననం
  • ఫోన్ చేసి అడుగుతుంటే బాధగా ఉందన్న మంత్రి
  • తనను ఇబ్బంది పెట్టిన వారు ఇబ్బంది పడక తప్పదని హెచ్చరిక
AP minister Muttamsetti srinivasa rao responded about viral audio

ఓ మహిళతో మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన మాట విని ఇంటికొస్తే అరగంటలో పంపించేస్తానని, వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ మహిళతో ఆయన మాట్లాడినట్టుగా ఉన్న ఆ ఆడియో  రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ ఆడియోపై స్పందించిన మంత్రి గత రాత్రి పది గంటల సమయంలో అత్యవసరంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆడియో నకిలీదని స్పష్టం చేశారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశానని, ప్రస్తుతం జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్న తనపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవని గుర్తు చేశారు. వైసీపీకి మహిళ్లలో విపరీతమైన ఆదరణ పెరుగుతోందన్నారు. దీనిని తట్టుకోలేకే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎవరెవరో తనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని అడుగుతుంటే బాధగా ఉందన్నారు.

తనను ఇబ్బంది పెట్టినవారు ఇబ్బంది పడక తప్పదని హెచ్చరించిన మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. నిందితులు ఎవరన్నది త్వరలోనే తేలుతుందని అన్నారు. తనకు శత్రువులు ఎవరూ లేరని పేర్కొన్నారు. వైసీపీలోని వారే ఈ పని చేయించారన్న ప్రచారం జరుగుతోందన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. తాను పార్టీలో గ్రూపులు నడపడం లేదని, కాబట్టి అలా అని తాను అనుకోవడం లేదని మంత్రి పేర్కొన్నారు.

More Telugu News