Virat Kohli: కోహ్లీ తనను తాను దిగజార్చుకున్నాడు: ఇంగ్లండ్​ మాజీ క్రికెటర్​ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

  • కోహ్లీ నోరు తెరిస్తే బూతులేనంటూ ట్వీట్
  • తనను 2012లో తిట్టాడని కామెంట్
  • అశ్విన్, ఫిలాండర్ ఉదంతాలను గుర్తు చేసిన నెటిజన్లు
  • అప్పుడెటు పోయారంటూ కాంప్టన్ పై విమర్శలు
  • కోహ్లీపై ట్వీట్ ను డిలీట్ చేసిన కాంప్టన్
England Ex Cricketer Provoking Comments On Virat Kohli Gets Bang On From Netizens

లార్డ్స్ టెస్టులో ఊహించని విధంగా భారత్ గెలవడం ఇంగ్లండ్ మాజీలకు రుచించనట్టుంది. మైదానంలోనే కాకుండా.. బయట కూడా భారత ఆటగాళ్లపై కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై నోరు పారేసుకున్నాడు.

కోహ్లీ నోరు తెరిస్తే బూతు పురాణాలేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘‘కోహ్లీ నోరు తెరిస్తే బూతులే వస్తాయి. 2012లో కోహ్లీ నన్ను తిట్టిన ఘటనను నేను మరువను. అలా తిట్టి కోహ్లీ తనను తానే దిగజార్చుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేదానికి సచిన్ టెండూల్కర్, జో రూట్, కేన్ విలియమ్సన్ లు నిదర్శనం’’ అని అతడు ట్వీట్ చేశాడు.


అతడి మాటలపై నెటిజన్లు విమర్శల తూటాలు కురిపించారు. వీడ్కోలు మ్యాచ్ లో అశ్విన్ ను ఆండర్సన్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఫిలాండర్ ను బట్లర్ అవమానించినప్పుడు ఎక్కడికి పోయారు? అంటూ మండిపడ్డారు. లార్డ్స్ టెస్టులో ముందు నోటికి పనిచెప్పింది ఇంగ్లండేనని గుర్తుంచుకోవాలని చురకలంటించారు. బుమ్రాను తిట్టింది ఇంగ్లండ్ ఆటగాళ్లేనన్నారు. '2012 ఘటన గురించి ఇప్పుడు ఏడుపా? ఇది మరీ బాగుంది..' అంటూ మరో నెటిజన్ సెటైర్ వేశారు. కాగా, విమర్శలు ఎక్కువైపోవడంతో కోహ్లీపై చేసిన ట్వీట్ ను కాంప్టన్ డిలీట్ చేశాడు.

More Telugu News