Madhya Pradesh: 35 రోజుల్లో 44 కొత్త విమానాల సర్వీసులు.. మధ్యప్రదేశ్‌కు సింధియా గిఫ్ట్

  • మోదీ నూతన కేబినెట్‌లో పౌరవిమానయాన శాఖ మంత్రిగా ప్రమాణం
  • ఇండోర్‌లో పర్యటించిన మంత్రి 
  • మోదీ, షా, నడ్డాకు ధన్యవాదాలు చెప్పిన సింధియా 
44 new flights in 35 days Scindia gift to Madhya Pradesh

మోదీ నూతన కేబినెట్‌లో పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతిరాదిత్య సింధియా.. ఇండోర్‌లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన 35 రోజుల్లో మధ్యప్రదేశ్ నుంచి 44 కొత్త విమానసేవలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

‘‘ఈరోజు జబల్‌పూర్ నుంచి ముంబై, పూణే, సూరత్, హైదరాబాద్, కోల్‌కతాలకు విమానాలు వెళ్తున్నాయి. ఆగస్టు 20 నుంచి జబల్‌పూర్ నుంచి ఢిల్లీ, ఇండోర్‌కు కూడా విమాన సేవలు మొదలవుతాయి’’ అని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. కొత్తగా ప్రారంభమైన 44 విమానాల్లో ఎనిమిదింటిని ఉడాన్ (యూడీఏఎన్) పథకం కింద తీసుకొచ్చారని తెలుస్తోంది. వైమానిక సేవలు తక్కువగా అందించే 100 విమానాశ్రయాల్లో సేవలు పెంచే యోచనతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది.

గతంలో సివిల్ ఏవియేషన్ శాఖను సింధియా తండ్రి మాధవరావు సింధియా నిర్వహించారు. 2019 వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జ్యోతిరాదిత్య సింధియా.. 22 మంది మద్దతుదారులతో కలిసి 2020 మార్చిలో బీజేపీలో చేరారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏర్పాటైన కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయింది.అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సింధియా.. కేబినెట్ విస్తరణలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

‘‘ప్రధాని మోదీ నాయకత్వంలో సివిల్ ఏవియేషన్ రంగంలో భారత్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా’’ అని సింధియా చెప్పారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీతోపాటు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News