ముగింపు దశలో 'అనుభవించు రాజా'

16-08-2021 Mon 19:17
  • కెరియర్ ఆరంభంలో వరుస హిట్లు 
  • కొంతకాలంగా నీరసించిన కెరియర్ 
  • మళ్లీ అన్నపూర్ణ బ్యానర్లో ఛాన్స్ 
  • షూటింగ్ దశలో సినిమా  
Raj Tharun new movie update
రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వరుస హిట్లు కొడుతూ వెళ్లాడు. కుర్రాడి సుడి మామూలుగా లేదు అని అంతా అనుకున్నారు. అయితే, ఆ తర్వాత ఉన్నట్టుండి ఒక పట్టాన హిట్టు దొరక్క నానా పాట్లు పడుతున్నాడు. 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' తరువాత అసలు రాజ్ తరుణ్ ఏ సినిమాలు చేశాడు? అవి ఎప్పుడు వచ్చి వెళుతున్నాయి? అనే విషయం కూడా తెలియకుండా పోతోంది.

ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ కి ఫస్టు ఛాన్స్ ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఆయనతో మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగినట్టుగా చెప్పుకుంటున్నారు. శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడని చెబుతున్నారు. గతంలో ఆయన రాజ్ తరుణ్ తో 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' చేశాడు. కానీ ఆ సినిమా సరిగ్గా ఆడలేదు.

మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'అనుభవించు రాజా' అనే టైటిల్ ను సెట్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మొదలైపోయిందని అంటున్నారు. ఈ సినిమాతో కొత్త కథనాయిక పరిచయం కానుంది. ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ మళ్లీ పుంజుకుంటాడేమో చూడాలి.