రమ్య హత్యకేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశాం: డీజీపీ గౌతమ్ సవాంగ్

15-08-2021 Sun 21:18
  • సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని హత్య
  • గుంటూరు అర్బన్ పోలీసుల అదుపులో నిందితుడు
  • కఠినంగా శిక్షిస్తామన్న డీజీపీ
  • స్థానికులు కీలక సమాచారం ఇచ్చారని వెల్లడి
DGP said police arrests Ramya murderer
గుంటూరులో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో 24 గంటలు గడవకముందే పోలీసులు పురోగతి సాధించారు. రమ్య హత్య కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. అతడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వివరించారు. స్థానికుల సమాచారం, సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా నిందితుడ్ని గుర్తించామని తెలిపారు. కేసు దర్యాప్తులో స్థానికులు కీలక సమాచారం ఇచ్చారని డీజీపీ పేర్కొన్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.

గుంటూరు అర్బన్ పోలీసులు అతడిని నరసారావుపేట మండలం పమిడిపాడు వద్ద అరెస్ట్ చేశారు. పోలీసులను చూసి బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు వేగంగా స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నిందితుడు శశికృష్ణ అనే యువకుడిగా భావిస్తున్నారు. అతడ్ని అరెస్ట్ చేసేంతవరకు సీసీ కెమెరా ఫుటేజి బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. అటు, హత్యకు ముందు శశికృష్ణ, రమ్యల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.