ఏపీలో దారుణ ఘటన.. కన్నబిడ్డను హత్య చేసిన తల్లి

13-08-2021 Fri 14:40
  • అనంతరం ఆత్మహత్యాయత్నం
  • ధర్మవరంలోని కొత్తపేటలో ఘటన
  • దంపతుల మధ్య గొడవలే కారణం
Woman Kills Daughter Later Tries To Kill Herself
తల్లిదండ్రుల మధ్య గొడవలకు ఓ రెండేళ్ల చిన్నారి బలైపోయింది. ఆవేశంలో కన్నబిడ్డ చేతి నరాలు, మెడను కోసి దారుణంగా చంపేసిందో తల్లి. ఆ తరువాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలోని కొత్తకోటలో జరిగింది. శ్రీనివాసులు, మీనాక్షి దంపతులకు తనూశ్రీ, ప్రణతి అనే ఇద్దరు కూతుర్లున్నారు. శ్రీనివాసులు మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దంపతులిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో శుక్రవారం తనూశ్రీని తీసుకుని శ్రీనివాసులు బయటకు వెళ్లాడు. దాంతో ఆవేశానికి లోనైన మీనాక్షి చిన్న కూతురు ప్రణతిని కత్తితో కోసి హత్య చేసింది. తర్వాత తానూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇరుగుపొరుగువారు గమనించి శ్రీనివాసులుకు సమాచారమందించారు. వెంటనే వచ్చిన శ్రీనివాసులు మీనాక్షిని ఆసుపత్రికి తరలించాడు. ధర్మవరం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.