కృష్ణా బోర్డు పర్యటనలో ఏపీ అధికారులు వెంట ఉన్నారు: తెలంగాణ అభ్యంతరం

12-08-2021 Thu 20:31
  • తెలుగు రాష్ట్రాల మధ్య నీటి జగడం
  • ఏపీలో కృష్ణా బోర్డు పర్యటన
  • అభ్యంతరాలతో లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం
  • లేఖ ప్రతిని కేంద్రానికి కూడా పంపిన వైనం
Telangana govt wrote KRMB Chairman again
నదీ జలాల అంశంలో ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఏపీలో కృష్ణా బోర్డు పర్యటన తీరుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బోర్డు సభ్యుల బృందం వెంట ఏపీ అధికారులు కూడా ఉన్నారంటూ తెలంగాణ ఆరోపిస్తోంది. ఏపీ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైనా తెలంగాణ అభ్యంతరం వెలిబుచ్చింది. ఈ మేరకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బోర్డు చైర్మన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

తాజా పరిణామాలతో కేఆర్ఎంబీ నివేదిక నిష్పాక్షికతపైనా సందేహాలు కలుగుతున్నాయని వెల్లడించింది. ఏపీ చర్యలు కృష్ణా బోర్డు సభ్యుల బృందాన్ని ప్రభావితం చేయొచ్చని అభిప్రాయపడింది. కాగా, కృష్ణా బోర్డుకు రాసిన ఈ లేఖ ప్రతిని తెలంగాణ సర్కారు కేంద్ర జలశక్తి శాఖకు కూడా పంపించింది.