అమెరికా, భారత్ చెలిమిపై అక్కసు వెళ్లగక్కిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

12-08-2021 Thu 16:10
  • భారత్, అమెరికా మధ్య పెరుగుతున్న మైత్రి
  • తమను అమెరికా పావులా వాడుకుందన్న ఇమ్రాన్
  • 20 ఏళ్లు పాక్ ను ఉపయోగించుకున్నారని వ్యాఖ్యలు
  • భారత్ కే అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వివరణ
Imran Khan comments on US and India
గత కొంతకాలంగా భారత్ కు అగ్రరాజ్యం అమెరికా దగ్గరవుతుండడాన్ని పాకిస్థాన్ భరించలేకపోతోంది. ఒబామా నుంచి నేడు బైడెన్ వరకు భారత్ కు స్నేహ హస్తం అందిస్తున్న నేపథ్యంలో పాక్ క్రమంగా చైనాకు దగ్గరవుతోంది. భారత్, అమెరికా చెలిమిని ఓర్చుకోలేని పాకిస్థాన్ వైఖరి నేడు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యలతో బహిర్గతమైంది.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి తాలిబన్లను తరిమికొట్టేందుకు పాకిస్థాన్ ను ఓ పావులా వాడుకుందంటూ అమెరికాపై మండిపడ్డారు. ఆఫ్ఘన్ సంక్షోభం పేరిట పాకిస్థాన్ ను 20 ఏళ్లపాటు తన అవసరాలకు ఉపయోగించుకుందని ఆరోపించారు. భారత్ తో పోల్చితే తమ దేశంతో అమెరికా భిన్న వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. భారత్ తో దౌత్య సంబంధాలకు అమెరికా అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందంటూ అక్కసు వెళ్లగక్కారు.

కాగా, తాలిబన్ నేతలు గతంలో పాకిస్థాన్ కు వచ్చినప్పుడు శాంతి ఒప్పందానికి అంగీకరించాలని వారికి తాము సూచించినట్టు ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఆఫ్ఘన్ లో ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయ అంగీకారం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. అష్రాఫ్ ఘని అధికారంలో ఉన్నంతకాలం తాము శాంతిచర్చలకు వెళ్లబోమని తాలిబన్ నేతలు అంటున్నారని తెలిపారు.

తమ నుంచి సహాయసహకారాలు అందుకుంటున్న పాకిస్థాన్, మరోవైపు తాలిబన్లకు మద్దతు ఇస్తోందన్న భావన అమెరికా ప్రభుత్వంలో నెలకొంది.