'పెళ్లిసందD' నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్!

12-08-2021 Thu 11:59
  • రోషన్  హీరోగా 'పెళ్లిసందD'
  • జోరుగా సాగిన టైటిల్ సాంగ్
  • అలరించిన కీరవాణి సంగీతం  
  • ఆకట్టుకున్న చంద్రబోస్ సాహిత్యం
Pelli SandaD title song released
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'పెళ్లి సందD' సినిమా రూపొందింది. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ .. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. గౌరీ రోణంకి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాతో కథానాయికగా శ్రీలీల తెలుగు తెరకి పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.

'పట్టుచీరల తళతళలు .. పట్టగొలుసులా గలగలలు' అంటూ ఈ పాట సాగుతోంది. పెళ్లి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉండగా, బంధుమిత్రుల సమక్షంలో నాయకా నాయికలు చేసే సందడినే ఈ పాట. ఒక వైపున పెళ్లి పనులు .. మరో వైపున కాలక్షేపపు కబుర్లు .. ఈడైన అబ్బాయిలు .. అమ్మాయిల మధ్య సాగే దోబూచులాటల ప్రస్తావన చేస్తూ ఈ పాట సాగుతుంది.

గతంలో శ్రీకాంత్ 'పెళ్లి సందడి'కి పాటలు రాసిన చంద్రబోస్, శ్రీకాంత్ కొడుకు 'పెళ్లి సందD' కూడా ఈ పాట రాయడం విశేషం. కీరవాణి సంగీతాన్ని అందించగా, హేమచంద్ర .. దీపు .. రమ్యబెహ్రా ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. గౌరి రోణంకి దర్శకత్వం వహించగా, దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్రరావు చేశారు. ఈ సినిమాలో ఆయన ఒక ప్రత్యేకమైన పాత్రను కూడా పోషించారు.