R Narayana Murthy: కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు : ఆర్.నారాయణ మూర్తి

KCR became inspiration to entire country with Rythu  Bandhu says R Narayana Murthy
  • రైతుబంధుతో దేశానికి కేసీఆర్ దిక్సూచిగా నిలిచారు
  • కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలు
  • దేశ సమస్యలపై సినిమాల ద్వారా నేను స్పందిస్తున్నా
రైతుబంధు పథకం చాలా అద్భుతమైనదని సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి కితాబునిచ్చారు. ఈ పథకానికి నాంది పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలిచారని కొనియడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలు, విద్యుత్ చట్టాలు రైతులకు వరాలు కావని... అన్నదాతల పాలిట శాపాలని మండిపడ్డారు.

ఎనిమిది నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. కరోనాతో ప్రపంచమంతా వణికిపోతుంటే... రైతు మాత్రం ధైర్యంగా వ్యవసాయం చేసి అందరికీ ఆహారాన్ని అందించాడని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం పక్కన పెట్టాలని... స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

గత 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందిస్తున్నట్టుగానే... సినిమాల ద్వారా తాను కూడా స్పందిస్తున్నానని నారాయణమూర్తి చెప్పారు. 'అర్ధరాత్రి స్వాతంత్ర్యం' నుంచి 'సుఖీభవ' వరకు 36 సినిమాలను తాను తీశానని తెలిపారు. తన 37వ సినిమా 'రైతన్న' ఈ నెల 14న విడుదలవుతుందని చెప్పారు. తమ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.
R Narayana Murthy
Tollywood
KCR
TRS
Rythu Bandhu

More Telugu News