సంచయిత చేసింది తక్కువ.. హడావుడి ఎక్కువ: అశోక్ గజపతిరాజు

11-08-2021 Wed 20:31
  • ట్రస్టు విషయంలో ఏపీ ప్రభుత్వం అతిగా కల్పించుకుంటోంది
  • ఇష్టానుసారం నియామకాలు చేపట్టి ట్రస్టు ప్రతిష్టను దెబ్బతీశారు
  • హైకోర్టు ఆదేశించినా ఈవో ఇంతవరకు నన్ను కలవలేదు
Sanchaita has done only little to Mansas trust says Ashok Gajapathi Raju
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజును కొనసాగిస్తూ ఏపీ హైకోర్టు ఈ రోజు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు స్పందిస్తూ... ట్రస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా కల్పించుకుంటోందని విమర్శించారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని అన్నారు. ఇష్టానుసారం నియామకాలను చేపట్టి మాన్సాస్ ట్రస్టు ప్రతిష్టను దెబ్బతీశారని మండిపడ్డారు.

మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా సంచయిత చేసింది తక్కువ, హడావుడి ఎక్కువని అశోక్ రాజు విమర్శించారు. ఆర్భాటాల కోసం ట్రస్టుకు చెందిన డబ్బులతో కోటి రూపాయలు పెట్టి కార్లు కొన్నారని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ ట్రస్టు ఈవో ఇంతవరకు తనను కలవలేదని, తన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని చెప్పారు. మాన్సాస్ ట్రస్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీపై తనకు ఆందోళన లేదని అన్నారు.