"పార్టీలు మొద్దు నిద్ర వీడడంలేదు"... నేరచరితుల అంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

10-08-2021 Tue 17:20
  • రాజకీయాల ప్రక్షాళనకు సుప్రీం ప్రయత్నాలు
  • నేతల క్రిమినల్ రికార్డులు వెల్లడి చేయాలని స్పష్టీకరణ
  • పార్టీలు ససేమిరా అంటున్నాయని అసంతృప్తి
  • పలు పార్టీలకు జరిమానా
Supreme Court fined parties for not reveal criminal records of candidates
రాజకీయాల్లో నేరచరితులు పెరిగిపోతుండడం పట్ల సుప్రీంకోర్టు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ అంశంపై జరిగిన విచారణలో రాజకీయ పక్షాలపై ఆగ్రహం వెలిబుచ్చింది. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా వారి క్రిమినల్ రికార్డులను బహిర్గతం చేయాలని పునరుద్ఘాటించింది. కాగా, నేర చరితుల అంశంలో గతంలో తమ ఆదేశాలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ సహా 9 పార్టీలు తప్పిదానికి పాల్పడ్డట్టు గుర్తించింది. వాటిలో 8 పార్టీలకు జరిమానా విధించింది.

ఈ సందర్భంగా జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పార్టీలు మొద్దు నిద్ర వీడేందుకు నిరాకరిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. పదేపదే చెబుతున్నా వీరికి తలకెక్కడం లేదని ఆగ్రహం వెలిబుచ్చింది. రాజకీయ నాయకులు దీనిపై త్వరగానే మేల్కొని, రాజకీయాలను నేరచరితుల మయం కాకుండా సుదీర్ఘ ప్రక్షాళన చేపడతారని భావిస్తున్నామని పేర్కొంది.

కాగా, ఈ కేసులో కాంగ్రెస్, బీజేపీ సహా ఐదు పార్టీలకు రూ.1 లక్ష చొప్పున... సీపీఎం, ఎన్సీపీలకు రూ.5 లక్షల చొప్పున సుప్రీం ధర్మాసనం జరిమానా వడ్డించింది.