Parliament: లోక్​ సభలో ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు.. వివిధ పార్టీల ఎంపీలు ఏమన్నారంటే..!

Opposition Unitedly Supports OBC Reservations Bill
  • రాజ్యాంగ 127వ సవరణ బిల్లుపై చర్చ
  • అన్ని పార్టీల ఏకగ్రీవ మద్దతు
  • కేంద్రం తప్పును సరిదిద్దుకుందన్న కాంగ్రెస్
  • కులాలవారీగా జనగణన చేయాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ
  • 10 నిమిషాల్లోనే 30 బిల్లులు పాస్ చేస్తారా? అని తృణమూల్ ప్రశ్న
పార్లమెంటులో పలు బిల్లులపై చర్చ జరుగుతోంది. రాజ్యసభలో జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) సవరణ బిల్లు 2021,  లోక్ సభలో ఓబీసీ కోటాకు సంబంధించి ప్రవేశపెట్టిన రాజ్యాంగ 127వ సవరణ బిల్లు 2021పై చర్చ నడుస్తోంది. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి కులాల జాబితాను తయారు చేసే అధికారం రాష్ట్రాలకే ఇస్తూ కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లుకు ప్రతిపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి.

గతంలో చేసిన తప్పులను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరిదిద్దుకుందని కాంగ్రెస్ లోక్ సభ ప్రతిపక్షనేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. ఈ బిల్లు చాలా కీలకమైనది కాబట్టే చర్చలో పాల్గొంటున్నామని చెప్పారు. పంచాయతీ రాజ్ చట్టాన్ని అమలు చేయడంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. మరాఠా రిజర్వేషన్లపైనా కేంద్రం దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

టీఆర్ఎస్ ఎంపీ బి.బి. పాటిల్, బిజూ జనతాదళ్ (బీజేడీ) ఎంపీ రమేశ్ చంద్ర, లోక్ జనశక్తి పార్టీ ఎంపీ ప్రిన్స్ రాజ్ , జేడీ (యూ) ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ లు బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ లలో రిజర్వేషన్ల సమస్యను ఇది పరిష్కరిస్తుందని ప్రిన్స్ రాజ్ అన్నారు. కాగా, శివసేన ఎంపీ వినాయక్ రౌత్ మరాఠాల రిజర్వేషన్లపై గళం వినిపించారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తర్వాతే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు.

కులాల వారీగా జనగణన చేపట్టాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బి.చంద్రశేఖర్ కేంద్రాన్ని కోరారు. బిల్లుకు మద్దతు తెలిపిన తృణమూల్ పార్టీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ.. పెగాసస్ మీద కూడా చర్చకు ఒప్పుకొంటే ఇప్పుడు జరుగుతున్నట్టే సమావేశాలు సాఫీగా సాగుతాయని అన్నారు. 30 బిల్లులను కేవలం 10 నిమిషాల్లోనే ఎలా పాస్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేవలం 11 శాతం బిల్లులనే కమిటీలు పరిశీలించాయన్నారు. ఓబీసీల రిజర్వేషన్ల కోసం డీఎంకే పోరాడిందని ఆ పార్టీ ఎంపీ టి.ఆర్. బాలు గుర్తు చేశారు.

కాగా, ఓబీసీలకు కాంగ్రెస్ ఎలాంటి రిజర్వేషన్లను ఇవ్వలేదని, కాకా కాలేల్కర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయలేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గుర్తు చేశారు. నాటి ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి.. ఓబీసీల క్రీమీలేయర్ పరిమితిని పెంచారని చెప్పారు.
Parliament
OBC Reservations
Opposition
Lok Sabha
Congress
BJP
TRS
YSRCP

More Telugu News