RGIA: అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా హ్యాట్రిక్ కొట్టిన శంషాబాద్ ఎయిర్ పోర్టు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టుకు స్కైట్రాక్స్ అవార్డు
  • వరుసగా మూడోసారి అవార్డు కైవసం
  • కొవిడ్ సంక్షోభంలోనూ మెరుగైన సేవలు
  • అంతర్జాతీయ స్థాయిలో 64వ ర్యాంకు
RGIA wins prestigious award third time in arow

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మితమైన హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టు మరోసారి అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా నిలిచింది. 2021 సంవత్సరానికి గాను అంతర్జాతీయ స్కైట్రాక్స్ అవార్డును శంషాబాద్ ఎయిర్ పోర్టు దక్కించుకుంది. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఈ అవార్డు దక్కడం వరుసగా మూడోసారి.

స్కైట్రాక్స్ సంస్థ ఆన్ లైన్ ద్వారా విమాన ప్రయాణికుల అభిప్రాయాలు, వారి సంతృప్తి స్థాయిని తెలుసుకుని ఈ అవార్డులు ప్రకటిస్తుంది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా 550 విమానాశ్రయాల్లోని ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. కరోనా పరిస్థితుల్లోనూ శంషాబాద్ విమానాశ్రయం ఆధునిక సాంకేతికతో కూడిన సేవలను అందించడంతో ఈ పురస్కారం దక్కినట్టు జీఎంఆర్ గ్రూప్ వెల్లడించింది.  

కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టు స్కైట్రాక్స్ అవార్డుతో పాటు టాప్-100 విమానాశ్రయాల జాబితాలో 64వ స్థానం దక్కించుకుందని జీఎంఆర్ వర్గాలు తెలిపాయి. గతంలో ఈ విమానాశ్రయం 71వ స్థానంలో ఉండగా, తాజాగా ఏడు స్థానాలు ఎగబాకింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ గ్రూప్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News