ప్రియుడు రమ్మంటే యూపీకి వెళ్లిన విజయవాడ యువతి.. చివరికి యమునలో శవమై తేలిన వైనం!

10-08-2021 Tue 13:24
  • మిస్సింగ్ కేసును ఛేదించిన కొత్తపేట పోలీసులు
  • నిందితులను అరెస్ట్ చేసి విజయవాడ తరలింపు
  • ఇవాళ కోర్టు ముందు హాజరు
Missing Vijayawada Girl Found Dead In UP Yamuna River
‘ప్రేమిస్తున్నాను. నా దగ్గరికి రా..’ అనగానే ఆ యువతి నమ్మేసింది. కన్న తల్లిదండ్రులనూ వదిలేసి ఊరుకాని ఊరికి వెళ్లింది. కానీ, వంచనకు గురై.. ప్రేమించిన వాడి చేతిలో హత్యకు గురైంది. చివరికి యమునా నదిలో శవమై తేలింది. విజయవాడకు చెందిన ఫాతిమా అనే యువతి విషాదగాథ ఇది. విజయవాడ కొత్తపేట పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇవీ పోలీసులు తెలిపిన వివరాలు..

తస్లీమా ఫాతిమా అనే యువతి స్థానికంగా ఉండే ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే, కొన్ని రోజుల క్రితం అతడు తన స్వస్థలం ఉత్తరప్రదేశ్ కు వెళ్లిపోయాడు. ఆమెనూ రమ్మని చెప్పడంతో గత నెల పదో తేదీన ఆమె కూడా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఫాతిమా యూపీలోని యమునా నదీ తీరంలో మృతి చెందినట్టు గుర్తించారు.

ఆమె యూపీకి వెళ్లాక ప్రియుడు మరో వ్యక్తితో కలిసి ఫాతిమా వద్ద ఉన్న నగలు, నగదును దోచుకున్నాడని, అనంతరం ఇద్దరూ కలసి ఆమెను నదిలోకి తోసేశారని యూపీ పోలీసులు నిర్ధారించారు. తొలుత ఆత్మహత్యగా సృష్టించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. విషయం తెలిసి విజయవాడ పోలీసులు యూపీకి వెళ్లారు. ఆ మృతదేహం ఆమెదేనని నిర్ధారించుకున్నారు. నిందితులను గుర్తించి విజయవాడకు తీసుకొచ్చారు. ఇవాళ వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.