Justice Ramana: విశేషాధికారాలు వున్న వారు కూడా థర్డ్-డిగ్రీకి అతీతులుకారని తేలిపోయింది: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

  • పోలీస్ స్టేషన్లలో మానవ హక్కులకు అత్యధిక ముప్పు
  • పోలీసు కస్టడీలో ఉన్న వారిపై చిత్రహింసలు
  • పోలీస్ స్టేషన్లలో న్యాయపరమైన ప్రాతినిధ్యం లేకపోవడం నిందితులకు శాపం
  • ఉచిత న్యాయ  సేవలపై విస్తృత ప్రచారం కల్పించాలి
  • ఎన్ఏఎల్ఎస్ఏ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
Threat To Human Rights Highest In Police Stations Chief Justice Ramana

మానవ హక్కులకు, మనిషి గౌరవానికి ‘పోలీస్ స్టేషన్లలో అత్యధిక ముప్పు’ ఏర్పడుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..  పోలీసు కస్టడీలో ఉన్న వారిపై జరుగుతున్న చిత్రహింసలపై ఆందోళన వ్యక్తం చేశారు. మానవహక్కులు, గౌరవం అనేవి ‘పవిత్రమైనవని’ అన్నారు. పోలీసు కస్టడీలో చిత్రహింసలు, ఇతర అకృత్యాలు ఇప్పటికీ ఈ సమాజంలో కొనసాగుతున్నాయని జస్టిస్ రమణ అన్నారు.

‘‘రాజ్యాంగపరమైన నిర్దేశాలు, హామీలు ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్లలో మాత్రం న్యాయపరమైన ప్రాతినిధ్యం లేకపోవడం అరెస్ట్/నిర్బంధంలో ఉన్న వారికి పెను శాపంగా మారుతోంది. నిందితుడు తొలి గంటల్లో తీసుకున్న నిర్ణయాలు తర్వాత తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది’’ అని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ (ఎన్ఏఎల్ఎస్ఏ) కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
 
ఇటీవల వచ్చిన వార్తలను బట్టి చూస్తుంటే విశేషాధికారాలు ఉన్న వారు కూడా థర్డ్-డిగ్రీకి అతీతులు కారని అర్థమైందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. అయితే, ఆయన ప్రత్యేకంగా ఏ కేసునూ ఉదహరించలేదు. పోలీసు చర్యలను అదుపులో ఉంచాలంటే రాజ్యాంగ హక్కులు, న్యాయపరమైన సాయం, అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

పోలీసు అధికారులకు కూడా వీటిపై అవగాహన కల్పించాలని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్‌, లేదంటే జైలులో డిస్‌ప్లే బోర్డులు, అవుట్ డోర్ హోర్డింగులను ఏర్పాటు చేయడం ఈ దశలో ఓ ముందడుగు అవుతుందన్నారు. ఈ సందర్భంగా ఉచిత న్యాయ సేవల కోసం ఎన్ఏఎల్ఎస్ఏ రూపొందించిన మొబైల్ యాప్‌ను జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.

More Telugu News