PM Modi: టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న ప్రతి భారత అథ్లెట్ ఒక చాంపియనే: ప్రధాని మోదీ

  • ముగిసిన టోక్యో ఒలింపిక్స్
  • ట్విట్టర్ లో మోదీ సందేశం
  • జాతిని గర్వించేలా చేశారని అభినందనలు
  • ఇక క్షేత్రస్థాయి నుంచి క్రీడాభివృద్ధి జరగాలని పిలుపు
  • జపాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
PM Modi on Tokyo Olympics closure

టోక్యో ఒలింపిక్స్ ముగింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో స్పందించారు. టోక్యో ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ కనబర్చిన భారత అథ్లెటిక్ బృందానికి అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. ఈ పోటీల్లో భారత క్రీడాకారులు నైపుణ్యం, అంకితభావం, సమష్టికృషి తదితర అంశాల్లో తమ అత్యుత్తమ సామర్థ్యాన్ని చాటారని కితాబిచ్చారు. అందుకే టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న ప్రతి భారత అథ్లెట్ ఒక చాంపియనే అని ఉద్ఘాటించారు. ఈ విశ్వ క్రీడా ఉత్సవంలో భారత్ గెలిచిన పథకాలు జాతిని గర్వించేలా చేశాయని పేర్కొన్నారు.

అదే సమయంలో దేశంలో క్షేత్రస్థాయి నుంచే క్రీడలకు ప్రజాదరణ కల్పించేందుకు ఇదే తగిన సమయం అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా నూతన ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని, భవిష్యత్తులో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు అందిపుచ్చుకుంటారని వెల్లడించారు.

ఇక, ఎంతో సంక్లిష్ట సమయంలోనూ విజయవంతంగా ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన జపాన్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వివరించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహించడం ద్వారా దృఢమైన సందేశం పంపారని, అంతేకాకుండా, క్రీడలు అందరినీ ఏకం చేస్తాయన్నది నిరూపితమైందని మోదీ పేర్కొన్నారు.

More Telugu News