Indian Athletes: టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లకు ఉచిత విమాన ప్రయాణం ఆఫర్

Free air travel offer for India medal winners in Tokyo Olympics
  • టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు 7 పతకాలు
  • ఒలింపిక్ చరిత్రలో భారత్ కు ఇవే అత్యధికం
  • ఐదేళ్ల పాటు ఉచిత ప్రయాణ ఆఫర్ ఇచ్చిన గో ఫస్ట్
  • జీవితకాల ఫ్రీ ట్రావెల్ ఆఫర్ ఇచ్చిన స్టార్ ఎయిర్
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొత్తం ఏడు పతకాలు లభించాయి. అయితే, ఈ ఒలింపిక్ క్రీడల్లో పతకాలు నెగ్గిన భారత అథ్లెట్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని గో ఫస్ట్ (గతంలో గో ఎయిర్), స్టార్ ఎయిర్ విమానయాన సంస్థలు ఆఫర్ ప్రకటించాయి. టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) స్వర్ణం సాధించగా, మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్), రవి దహియా (రెజ్లింగ్) రజతాలు దక్కించుకున్నారు. పీవీ సింధు (బ్యాడ్మింటన్), భజరంగ్ పునియా (రెజ్లింగ్), లవ్లీనా బొర్గోహైన్ (బాక్సింగ్), పురుషుల హాకీ జట్టు కాంస్యాలు సాధించారు.

వీరందరికీ వచ్చే ఐదేళ్ల పాటు ఉచితంగా ప్రయాణించేందుకు టికెట్లు అందిస్తామని గో ఫస్ట్ ప్రకటించింది. భారత్ కు 7 పతకాలు ఎప్పుడూ లభించలేదని, ఇది వేడుకలు చేసుకోవాల్సిన సమయం అని తెలిపింది. అందుకే 2025 వరకు వర్తించేలా ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్నామని గో ఫస్ట్ వివరించింది.

ఇక దేశీయ విమానయాన సంస్థ స్టార్ ఎయిర్ జీవితకాల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచినవారికి ఈ ఆఫర్ అందించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని స్టార్ ఎయిర్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Indian Athletes
Medal Winners
Tokyo Olympics
Free Air Travel
Go First
Star Air

More Telugu News