Amazon: సుప్రీంకోర్టులో అమెజాన్ కు భారీ విజయం... రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ లకు తీవ్ర నిరాశ

  • ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ మధ్య గతంలో ఒప్పందం
  • ఒప్పందం విలువ 3.4 బిలియన్ డాలర్లు
  • ఒప్పందం చెల్లదన్న సింగపూర్ ఆర్బిట్రేషన్
  • అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకు చేరిన వ్యవహారం
Amazon gets big win in Supreme Court against Future Group and Reliance

ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. ఫ్యూచర్ గ్రూప్ కు చెందిన రిటైల్ వ్యాపారాన్ని 3.4 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసేందుకు రిలయన్స్ గతంలో ఒప్పందం కుదుర్చుకోగా, ఈ ఒప్పందాన్ని ఎంతమాత్రం ముందుకు తీసుకువెళ్లవద్దంటూ సుప్రీంకోర్టు నేడు ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగపూర్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయదగ్గవేనని స్పష్టం చేసింది.

ఫ్యూచర్ గ్రూప్ అమెజాన్ కు చెందిన వ్యాపార భాగస్వామి. అయితే, తమ మధ్య ఉన్న అగ్రిమెంటును ఖాతరు చేయకుండా రిటైల్ ఆస్తులను రూ.24,731 కోట్లకు రిలయన్స్ కు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపిస్తూ, అమెజాన్ న్యాయపరమైన చర్యలకు దిగింది. అమెజాన్ విజ్ఞప్తిపై స్పందించిన సింగపూర్ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్.... రిలయన్స్ రిటైల్ లో విలీనం కారాదంటూ ఫ్యూచర్ గ్రూప్ ను ఆదేశించారు. ఈ క్రమంలో, సింగపూర్ ఆర్బిట్రేషన్ ఆదేశాలు అమలు జరిగేలా చూడాలంటూ అమెజాన్ ఢిల్లీ హైకోర్టును కోరింది.

దాంతో ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ స్పందిస్తూ, ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ రిటైల్ మధ్య ఒప్పందాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ ఆస్తులను సీజ్ చేయాలని, ఆయనకు మూడు నెలల జైలు ఎందుకు విధించరాదో చెప్పాలని పేర్కొంది. దీనిపై అమెజాన్ ప్రత్యర్థి వర్గాలు ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా, వారికి ఊరట కలిగిస్తూ తీర్పు వచ్చింది.

ఈ నేపథ్యంలోనే అమెజాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సబబుగానే ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సింగపూర్ ఆర్బిట్రేషన్ ఆదేశాలు అమలు యోగ్యంగానే ఉన్నాయని పేర్కొంది. సింగిల్ బెంచ్ ఆదేశాలనే తాము ఖరారు చేస్తున్నట్టు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

కాగా, సుప్రీం తీర్పు అనంతరం స్టాక్ మార్కెట్లో రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ షేర్లు పతనం అయ్యాయి. దీనిపై ఫ్యూచర్ గ్రూప్ స్పందిస్తూ, రిలయన్స్ తో ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు తాము అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తామని వెల్లడించింది. వాటాదారులు, ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.

అటు, అమెజాన్ వర్గాలు స్పందిస్తూ, భారత్ లో తాము 6.5 బిలయన్ డాలర్ల పెట్టుబడులకు నిశ్చయించామని, ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే ఆ పెట్టుబడుల విషయంలో కోలుకోలేని నష్టం జరిగి ఉండేదని అభిప్రాయపడింది.

భారత్ వంటి పెద్ద దేశంలో రిటైల్ వ్యాపారం కూడా అదే స్థాయిలో జరుగుతుందని గుర్తించిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, రిలయన్స్ బాస్ ముఖేశ్ అంబానీ ఎప్పటినుంచో వ్యాపార పరమైన పావులు కదుపుతున్నారు.

More Telugu News