Rajiv Gandhi: ‘రాజీవ్​ గాంధీ’ ఖేల్​ రత్న అవార్డు పేరును మార్చేసిన కేంద్రం.. వెల్లడించిన ప్రధాని

Central Govt Changes Rajiv Khel Ratna Award Name
  • ఇక నుంచి ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’
  • ప్రజల విజ్ఞప్తుల మేరకు మార్చామన్న మోదీ
  • గొప్ప నిర్ణయమంటున్న నెటిజన్లు
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఆ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. ‘రాజీవ్’ను తీసేసి హాకీకి వన్నె తెచ్చిన క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరును చేర్చారు.

ఇక నుంచి క్రీడల్లో అత్యున్నత అవార్డును ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’గా పిలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరు పెట్టాల్సిందిగా తనకు ఎప్పట్నుంచో విజ్ఞప్తులు వస్తున్నాయని మోదీ చెప్పారు. వారు వెల్లడించిన అభిప్రాయాలకు ధన్యావాదాలు చెప్పారు. ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగా ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరును పెట్టామన్నారు. దేశానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని ఆయన కొనియాడారు.

కాగా, రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1992లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను ప్రారంభించారు. అయితే, ఇన్నాళ్లకు ఆ అవార్డుకు ధ్యాన్ చంద్ పేరును పెట్టారు. మూడు వరుస ఒలింపిక్స్ లో ధ్యాన్ చంద్ నేతృత్వంలోని హాకీ బృందం స్వర్ణ పతకాలను సాధించింది. ఆయన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతి రోజైన ఆగస్టు 29న క్రీడా దినోత్సవంగా జరుపుకొంటారు. కాగా, ఇది గొప్ప నిర్ణయమని, చరిత్రలో నిలిచిపోతుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Rajiv Gandhi
Khel Ratna
India
Prime Minister
Narendra Modi
Dhyan Chand

More Telugu News