డ్రైనేజ్ శుభ్రం చేయడానికి మ్యాన్‌హోల్‌లో దిగిన ఇద్ద‌రు కార్మికుల మృతి.. రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం

04-08-2021 Wed 11:33
  • వనస్థలిపురం పరిధిలోని సాహెబ్‌నగర్‌లో ఘ‌ట‌న‌
  • ఊపిరి ఆడ‌క అంత‌య్య‌, శివ మృతి
  • కాంట్రాక్ట‌ర్‌, అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రేవంత్ డిమాండ్  
revanth reddy slams govt

హైదరాబాద్‌లో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్‌నగర్‌లో డ్రైనేజీని శుభ్రం చేసేందుకు దిగిన‌ ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు అంతయ్య, శివ అనే కార్మికులని అధికారులు చెప్పారు. రాత్రి స‌మ‌యంలో డ్రైనేజ్ క్లీన్ చేసేందుకు అనుమతులు ఉండ‌వు.

అయిన‌ప్ప‌టికీ నలుగురు కార్మికులను మురికి కాలువలోకి దిగాల‌ని కాంట్రాక్టర్ చెప్ప‌డంతో మొద‌ట శివ మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. అతను అందులోనే చిక్కుకుపోవడంతో కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా చిక్కుకుని ఊపిరి ఆడక మృతి చెందాడు. మ‌రో ఇద్దరు కార్మికులు మ్యాన్‌హోల్ బ‌య‌ట నుంచి వారిని కాపాడే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఫలితం దక్కలేదు. మ్యాన్‌హోల్ నుంచి స‌హాయ‌క సిబ్బంది మృతదేహాలను బ‌య‌ట‌కు తీశారు.

మృతులిద్దరూ సైదాబాద్, చింతల్‌బస్తీకి చెందిన వారిగా అధికారులు తెలిపారు. మృతుడు శివకుమార్‌కు మూడేళ్ల కిందటే వివాహం జ‌రిగింది. ఆయ‌న‌ భార్య ఎనిమిది నెలల గర్భవతి. అలాగే, మృతుడు అంతయ్యకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

సాహెబ్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ విషాద ఘ‌ట‌న‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంట్రాక్ట‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. 'సాహెబ్ నగర్ లో విధి నిర్వహణ కోసం మ్యాన్ హోల్ లో దిగి, ఊపిరాడక జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు అంతయ్య, శివ మృతి చెందడం విచారకరం. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ విధులు చేయించిన అధికారులు, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.