కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. గవర్నర్ ఆమోదం

02-08-2021 Mon 18:00
  • గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ప్రతిపాదించిన టీఆర్ఎస్ ప్రభుత్వం
  • ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై ఆమోదం
  • ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి
TS governor Tamilisai accepts governor quota MLC

ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు. దీంతో, త్వరలోనే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకు వస్తుందని కౌశిక్ రెడ్డి ఆశించారు. అయితే, ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరే సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. చెప్పినట్టుగానే రోజుల వ్యవధిలోనే ఆయనను ఎమ్మెల్సీ చేశారు.