PV Sindhu: చరిత్ర సృష్టించిన సింధు... శుభాభినందనల వెల్లువ

  • రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన తొలి భారత క్రీడాకారిణి
  • 2016 రియో ఒలింపిక్స్ లో రజతం
  • ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం
  • గర్వపడుతున్నామన్న ఉపరాష్ట్రపతి
  • తిరుగులేని ప్రదర్శన అంటూ మోదీ కితాబు
Wishes pours on PV Sindhu after she won bronze in Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ రెండో పతకం సాధించింది. మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించగా, తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కాంస్యం నెగ్గింది. అంతేకాదు, ఈ పతకం ద్వారా సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు పుటల్లోకెక్కింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన సింధు, ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది.

నిన్న సింధు సెమీస్ లో ఓడిపోయిన తర్వాత తీవ్ర నిరాశలో కూరుకుపోయిన యావత్ భారతావని, తాజా విజయంతో ఉప్పొంగిపోతోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తదితరులు సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన పోరాటంతో టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధును మనస్ఫూర్తిగా అభినందించారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోషల్ మీడియాలో తన స్పందన తెలియజేశారు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన సింధుకు శుభాభినందనలు అని వ్యాఖ్యానించారు. ఒలింపిక్ చరిత్రలో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణి సింధు చరిత్ర సృష్టించిందని కొనియాడారు. తన నిలకడ, అంకితభావం, నైపుణ్యంతో సరికొత్త ప్రమాణాలను నమోదు చేసిందని తెలిపారు.

సింధు చరిత్ర సృష్టించిందని, ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ సింధు మాత్రమేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆమె అమోఘమైన ప్రదర్శన ప్రతి భారతీయుడ్ని గర్వించేలా చేస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ సింధు మరిన్ని ఘనవిజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ... సింధు తిరుగులేని ప్రదర్శనతో అందరం సంతోషిస్తున్నామని తెలిపారు. సింధు భారత్ కు గర్వకారణమని, దేశం నుంచి ఉద్భవించిన అతికొద్దిమంది అద్భుతమైన ఒలింపియన్లలో సింధు కూడా ఒకరని మోదీ కొనియాడారు.

కాంస్యం కోసం పోరులో సింధు విజయం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ ద్వారా శుభాభినందనలు తెలియజేశారు. మరోసారి గర్వపడేలా చేశావంటూ అభినందించారు. 

More Telugu News