జల్సాలకు అలవాటు పడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. కన్నబిడ్డనే కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్

01-08-2021 Sun 09:40
  • ప్రకాశం జిల్లాలో ఘటన
  • జల్సాలకు అలవాటు పడి రూ. 20 లక్షల అప్పు
  • చెల్లించేందుకు కుమారుడి కిడ్నాప్
  • డబ్బులు ఇవ్వకుంటే కుమారుడిని చంపి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక
Software engineer kidnapped his son for money in andhrapradesh

వ్యసనాలకు బానిసైన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కన్నబిడ్డనే కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలంలో జరిగిందీ ఘటన.

గ్రామానికి చెందిన పల్నాటి రామకృష్ణారెడ్డి-ఉమ దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఏడాదిగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న రామకృష్ణారెడ్డి జూదం, మద్యం వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో రూ. 20 లక్షల వరకు అప్పులు చేశాడు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడిగితే వారు నిరాకరించారు.

దీంతో గత నెల 28న తన కుమారుడినే అపహరించి కందుకూరులోని ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి భార్య ఉమకు ఫోన్ చేసి కుమారుడు తన దగ్గరే ఉన్నాడని, తాను అడిగిన రూ. 20 లక్షలు ఇవ్వకుంటే చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రామకృష్ణారెడ్డి లాడ్జిలో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి చెర నుంచి కుమారుడిని విడిపించి తల్లికి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.