మళ్లీ కరోనా కలకలం... ఏపీ సహా 10 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

31-07-2021 Sat 19:37
  • దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి
  • 10 శాతాన్ని మించిన పాజిటివిటీ రేటు
  • తక్షణమే చర్యలు తీసుకోవాలన్న కేంద్రం
  • వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని స్పష్టీకరణ
Union health ministry warns states about corona surge in some districts

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఊపందుకోవడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, అసోం, మిజోరం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో కరోనా కేసుల పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ 10 రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం దాటిందని, మరో 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్యన ఉందని వివరించింది. ఈ జిల్లాల్లో ఏమాత్రం అలసత్వం చూపించినా పరిస్థితి దారుణంగా మారుతుందని హెచ్చరించింది. ఆయా రాష్ట్రాలు తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కంటైన్మెంట్ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయడమే కాకుండా, 60 ఏళ్లు పైబడినవారికి, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగినవారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా వ్యవస్థలపై నియంత్రణ, జన సమూహాలను నిరోధించడం తప్పనిసరి అని పేర్కొంది.